తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం "నీళ్లు, నిధులు, నియామకాలు" అనే ప్రధాన నినాదాలపై సాగింది. అందులో ముఖ్యమైనది నీటి హక్కుల పరిరక్షణ. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ గుండా ప్రవహిస్తున్నప్పటికీ గతంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా అన్యాయంగా నిర్లక్ష్యం చేయబడింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల – కావేరి లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలో తెలంగాణకు లభించాల్సిన 213 టీఎంసీలు, అలాగే కృష్ణా నదిలో 90 టీఎంసీల నీటి వినియోగ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరం.
జహీరాబాద్ నియోజకవర్గం కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 76 సాగునీటి చెరువులు ఉన్నాయి వాటి ఆయకట్టు 12,265 ఎకరాలు. అయితే ప్రస్తుతం కేవలం 2,935 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. మిగతా ఆయకట్టు నిరుపయోగంగా మారింది.
ఈ చెరువుల నిర్వహణ కోసం జహీరాబాద్‌లో ఒక ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు చేయబడింది. ఇందులో 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 4 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,12 ఏఈ/ఏఈఈలు, సుమారు 30 మంది సాంకేతిక సిబ్బంది, 15 మంది పరిపాలనా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి నిర్వహణకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది.
అయితే కాలువల దుస్థితి, చెరువుల బండల బలహీనత, నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఆయకట్టు విస్తరణ జరగడం లేదు. ప్రజాధనం ఖర్చవుతున్నా రైతులకు తగిన ప్రయోజనం అందడం లేదు.
అందువల్ల ప్రభుత్వం వెంటనే చెరువుల మరమ్మతులు చేపట్టాలి, కాలువలను పునరుద్ధరించాలి, కొత్త సాగునీటి పనులకు నిధులు మంజూరు చేయాలి, అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో శివకుమార్,యస్.గోపాల్,యస్,వెంకట్,వీర్ శెట్టి,మేఘనా థ్,తదితరులు ఉన్నారు




